|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ తీవ్రమైందని అన్నారు. 87235 ఎకరాల దేవాదాయ భూముల్లో 20124 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, అయితే కేవలం 1146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదయ్యాయని తెలిపారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేయాలని, హిందూ యాత్ర పథకాన్ని అమలు చేసి చార్ధామ్ యాత్రకు ప్రభుత్వ సహాయం అందించాలని సూచించారు. దేవాలయాల ఆదాయాన్ని పారదర్శకంగా వినియోగించేందుకు “తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ” ఏర్పాటు చేయాలని కోరారు.
పర్యాటక రంగాన్ని గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయాలని, ఇందూర్ ఖిల్లా రామాలయాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని సూచించారు. క్రీడా అభివృద్ధికి ప్రతి జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలను నిర్మించాలని, ఇందూర్లో రాజారామ్ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని డిమాండ్ చేశారు.
విద్యా రంగంలో వసతులు మెరుగుపరచాలని, మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, గుడులు, బడుల సమీపంలో మద్యం దుకాణాలు నిషేధించాలని సూచించారు.








