|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన తప్పిదాలు ప్రజల్లో అయోమయం రేపుతున్నాయి.
పత్రాల పరిశీలనకు ముందు👇

శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మొత్తం 110 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు నమోదయ్యాయి అని, మండల ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించగా, మరుసటి రోజు పత్రాల పరిశీలన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో సంఖ్య 112కు పెరగడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది.
పత్రాల పరిశీలన అనంతరం👇

ప్రత్యేకంగా కుర్నపల్లి గ్రామంలో అయిదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయినప్పటికీ, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం అధికారులు 7 నామినేషన్లు నమోదయ్యాయి అని మీడియాకు ఇచ్చిన వివరాల్లో పేర్కొనడం స్థానిక ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఈ అంశంపై స్థానిక కుర్నపల్లి రిటర్నింగ్ అధికారులను ప్రశ్నించగా, వాస్తవానికి 5 నామినేషన్లే దాఖలు అయ్యాయని వారు స్పష్టంచేశారు.
దీంతో ఈ పొరపాటు మండల స్థాయి కార్యాలయంలోనే జరిగిందని స్పష్టమౌతోంది.
అత్యంత కీలక సందర్భాల్లో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల వివరాల్లో జరిగిన ఈ వైఖరి కారణంగా అభ్యర్థులు, గ్రామస్తులు, రాజకీయ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నామినేషన్ల రికార్డులను పారదర్శకంగా పరిశీలించి, తప్పిదాలకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఎడపల్లి మండలంలో ఎన్నికల నిర్వహణపై నమ్మకం కోల్పోకుండా, భవిష్యత్ ప్రక్రియలు నిర్మలంగా కొనసాగేవిధంగా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








