|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై జరిగిన సంచలన దాడి, దోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వేగంగా దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశాయి.
ఈ నెల 25న మధ్యాహ్నం సమయంలో ముఖానికి ముసుగు ధరించిన గుర్తుతెలియని వ్యక్తి వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటనతో జంగరాయి గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో శనివారం ఉదయం **తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)**ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం ఉంగరం, అలాగే నేరానికి ఉపయోగించిన TVS XL వాహనం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో, బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు వెల్లడైంది. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.








