|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలో ప్రజల భద్రత కోసం విస్తృత స్థాయిలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టబడ్డాయి.

తనిఖీల్లో బస్ స్టేషన్, దాబాలు, హోటళ్లు, పాన్ షాపులు, అలాగే ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ప్రతి మూలను పరిశీలించగా, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందం మాదకద్రవ్యాల అన్వేషణలో పాల్గొంది.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత పోలీసుల ప్రాధాన్యమని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తూ, పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి నేరాలను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్ఐ జ్యోతి, ఏఎసై శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ శ్రావణ్, బాంబ్ స్క్వాడ్ సిద్దిరాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.








