|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవినీతిని నిర్మూలించి పారదర్శక పాలనను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులే అని పేర్కొన్నారు.

ప్రజల పట్ల జాలి, కరుణతో వ్యవహరించాలని, వృత్తిపట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు.
అవినీతి ఆలోచనలు ఉన్న అధికారులు, సిబ్బంది వెంటనే మారాలని హెచ్చరించిన కలెక్టర్ పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతాం అని స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో పేరుకు పోతున్న అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమని, జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి మెదక్‌ను అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. అనంతరం అవినీతిని నిర్మూలించేందుకు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు, ఆర్డీఓ రమాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.








