|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో నిర్మించాల్సిన కళ్యాణ మండపం నిధుల లేమి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. స్థానిక ప్రజలకు, భక్తులకు ఎంతో అవసరమైన ఈ ప్రజాప్రయోజన భవనం దాదాపు రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ పూర్తికాకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

2024 ఫిబ్రవరిలో రూ.78 లక్షల రూర్బన్ పథకం నిధులతో బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి భూమిపూజ నిర్వహించి కళ్యాణ మండప నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. అప్పట్లో వేగంగా ప్రారంభమైన పనులు ప్రస్తుతం సుమారు 80 శాతం వరకు పూర్తయ్యాయి. అయితే మిగిలిన పనులకు అవసరమైన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది.
ఇప్పటికే విడుదలైన నిధులు పూర్తిగా అందకపోవడం, మిగిలిన బిల్లులు చెల్లించకపోవడం, నిర్మాణ పనులు పూర్తి చేసిన బిల్లులు వస్తాయో లేదో అనే కారణాలతో కాంట్రాక్టర్లు పనులు కొనసాగించేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం. దీంతో ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఈ కళ్యాణ మండపం ఆలయానికి అనుబంధంగా స్థానిక గ్రామాల్లోని పేద ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయుక్తమని పలువురు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం పనులు నిలిచిపోవడం వల్ల భక్తులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మిగిలిన నిధులను విడుదల చేసి, కళ్యాణ మండప నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానిక గ్రామల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రయోజన భవనాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలని వారు కోరుతున్నారు.








