|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
జిల్లా వ్యాప్తంగా వచ్చిన పిర్యాదుదారుల నుండి మొత్తం మూడు ఫిర్యాదులను స్వీకరించి, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు ఇచ్చారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ – “ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి జోక్యం లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలి. చట్టబద్ధ పరిష్కారం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే మా ప్రధాన లక్ష్యం” అన్నారు.
అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారుల సహకారంతో తక్షణమే పరిష్కరిస్తున్నామని, జిల్లా పోలీస్ శాఖ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.








