|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనటానికి వివిధ శాఖల సమన్వయంతో శిక్షణ కల్పించేందుకు రిసోర్స్ పర్సన్స్, వాలంటీర్లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో ఆపదమిత్ర పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు, డి.ఆర్.డి.ఓ, మెప్మా, రెవెన్యూ, ఫైర్, మత్స్య, ఇండస్ట్రీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనటానికి శిక్షణ కీలకమని తెలిపారు.
వాలంటీర్ల ఎంపిక & శిక్షణ వివరాలు :
18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల ఆసక్తి ఉన్న యువతీ యువకులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎక్స్-సర్వీస్ మెన్, సివిల్ డిఫెన్స్ ఉద్యోగులు, మహిళా సంఘాల వారు రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపికకు అర్హులు.
👉 జిల్లాలో 200 మంది శక్తివంతమైన వాలంటీర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
👉 శిక్షణ రెండు బ్యాచ్‌లుగా మెదక్ టీఎన్జీవో భవనం, మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు.
👉 శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నారు.
శిక్షణలో ఉండే అంశాలు :
👉 వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలి?
👉 ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే విధానాలు.
ప్రభుత్వ విభాగాల విధులపై అవగాహన – శిక్షణ వివరాలు :
ఈనెల 20న ప్రారంభమై 31 వరకు 12 రోజులు శిక్షణ కొనసాగుతుంది అని, ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు శిక్షణ ఉంటుంది అని, ఈ శిక్షణ స్థానిక అగ్నిమాపక కేంద్రాలు, ఇతర అత్యవసర సేవలతో సమన్వయం చేయనున్నారు.
ఈ సమావేశంలో మెప్మా పీడీ ఇందిరా, డి.ఆర్.డి.ఓ పీడీ శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, మత్స్య శాఖ, అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.








