|| దృశ్యం న్యూస్ ||
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సంసిద్ధతపై అవగాహన పెంపొందించుకోవాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 200 మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించిందని, ప్రజలకు సమగ్ర అవగాహనతో పాటు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.

ఈ శిక్షణలో వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్నిప్రమాదాలు, పాముకాటు, ఉరుములు, మెరుపులు వంటి విపత్తులను ఎదుర్కొనే విధానాలపై వాలంటీర్లకు మార్గదర్శనం అందించనున్నారు. కమ్యూనిటీ వాలంటీర్లు విపత్తు నిర్వహణ, ప్రాథమిక రక్షణ చర్యలు, అగ్ని భద్రతా చర్యలు నేర్చుకోవడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించగలరని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వహణాధికారి వై. దామోదర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, మెప్మా పీడీ ఇందిరా తదితర అధికారులు పాల్గొన్నారు.








