|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్యమైన సమాచారం తెలిపారు.
కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, ప్రభుత్వ గుర్తింపు లేకుండా, ఇంకా గుర్తింపునకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించకుండానే 2025-2026 విద్యా సంవత్సరానికి “కార్పొరేట్ స్కూల్” మరియు “ఇంటర్నేషనల్ స్కూల్” పేరిట విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభిస్తున్నాయి అని, పట్టణంలోని పలు ప్రదేశాల్లో పెద్ద పెద్ద ప్రకటన బోర్డులు ఏర్పాటు చేసినట్లు గుర్తించబడింది అని తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, అన్ని మండలల విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గుర్తింపు లేని పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలు తీసుకుంటే ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మూసివేయడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా, 2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా ఎటువంటి ప్రవేశాలు తీసుకోకూడదని అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరిక జారీ చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది తప్పకుండా సరి చూసుకోవాలి అని తెలుపుతూ, ఈ సమాచారం సంబంధిత మండల విద్యాశాఖ అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలి అని, పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకుని ప్రవేశాలు తీసుకోవాలని సూచించారు.
లేనిపక్షంలో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యాశాఖ హెచ్చరించింది.








